అధ్యాత్మ సంకీర్తన
రేకు: 189-5
సంపుటము: 2-454
రేకు: 189-5
సంపుటము: 2-454
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| అట్టయితే నా యంతర్యామివేలైతివయ్యా మట్టుమీఱి ముక్తియాస మాననటవయ్యా | ॥పల్లవి॥ |
| పొలఁతులు లేరా భూమి భోగించే నే లేనా కలకాల మింద్రియాల కాణాచి లేవో తొలి యీసంసారము లేదో నాకాంక్షలు లేవో యెలమి నిన్నుఁ గొలుచు టిందుకటవయ్యా | ॥అట్ట॥ |
| ధరలోఁ బసిఁడి లేదా తగిలి నాయాస లేదా సిరుల యజ్ఞానపుచీఁకటి లేదా అరయఁ జవులు లేవా అందుకో నాలికె లేదా యిరవై నిన్నుఁ గొలుచు టిందుకటవయ్యా | ॥అట్ట॥ |
| అట్టే సర్వాపరాధి నపరాధా లెంచనేల గట్టిరాళ్లలో మలిగండ్లేరనేల నెట్టన శ్రీవేంకటేశ నిన్నుఁ జూచి కావకుంటే ఇట్టే నిన్నుఁ గొలుచు టిందుకటవయ్యా | ॥అట్ట॥ |


