అధ్యాత్మ సంకీర్తన
రేకు: 191-1
సంపుటము: 2-462
రేకు: 191-1
సంపుటము: 2-462
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| వినవమ్మ జానకి నీవిభుఁ డింత సేసినాఁడు యెనసి యీరఘుశ్రీరాముఁ డికఁ నేమి సేసునో | ॥పల్లవి॥ |
| వానరులదండు గూడి వారధి కొండలఁ గట్టె ఆని లంక చుట్టిరా నదే విడిసె కోనలఁ ద్రికూటమెక్కె గొడగు లన్నియుఁ జెక్కె యే నెపాన రఘురాముఁ డిఁక నేమి సేసునో | ॥విన॥ |
| కోరి ఇంద్రజిత్తుఁ జంపె కుంభకర్ణు నిర్జించె ఘోరదానవులనెల్ల కూలఁగుమ్మెను మారణహోమము సేసె మతకమింతాఁ జెరిచె యీరసాన రఘురాముఁ డిఁక నేమి సేసునో | ॥విన॥ |
| లావున రావణుఁ జంపె లంక విభీషణు కిచ్చె చేవల నోసీత నిన్నుఁ జేకొనెను భావించి శ్రీవేంకటాద్రిఁ బట్టము దాఁ గట్టుకొనె యీవలనావల నాతఁ డిఁక నేమి సేసునో | ॥విన॥ |


