కీర్తనలు భద్రాచల రామదాసు అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను
వరాళి - రూపక (-త్రిపుట)
పల్లవి:
అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను అ..
అను పల్లవి:
గడియగడియకు తిరిగితిరిగి యడిగితిని వేసారవచ్చెను
గడువుదప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను అ..
చరణము(లు):
కుదురుగా గూర్చుండనియ్యను కోపమొచ్చిన భయము చెందను
మది నెరింగి యుండుమిక మొగమాటమేమియు లేదుగద నా
హృదయ కమలమునందు నీ మృదు పదములను బంధించివేతును అ..
రేపు మాపని జరిపితే నే నాపుజేసెడివాడ గాను
ప్రాపు నీవని నమ్మిగొలిచిన పాపముల నెడబాపి దయతో
తేపతేపకు నీదు మోమిటు చూపకుండిన నోర్వసుమ్మి అ..
పతితపావన బిరుదులేదా పాలనము నను సేయరాదా
ప్రతిదినంబును దేవ నిను భూపతి వటంచును వేడినను నీ
హితజనంబులు వచ్చి నన్ను బ్రతిమాలినను విడబోను నిన్ను అ..
రాక్షసాంతక భక్తవరదా సారసాక్ష సుజనరక్షక
యీ క్షణంబున దీనజనుడని మోక్షమియ్యక యుంటివా నిను
సాక్షి బెట్టియు నేడు నేనొక దీక్షచే సాధింతు నిన్ను అ..
భూరి భద్రాచలనివాసా భుజగశయనా భక్తపోష
కూరిమిగ నిను విడిచిపెట్టిన ధరణిలో భద్రాద్రి రాఘవ
రామదాసుం డనెడి నామము మారుపేరున బిలువు నన్ను అ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - aDugudaaTi kadalaniyyanu naakabhaya miyyaka ninnu viDuvanu ( telugu andhra )