కీర్తనలు భద్రాచల రామదాసు అబ్బబ్బా రామనామం అత్యద్భుతము
ధన్యాసి - చాపు( - ఆది)
పల్లవి:
అబ్బబ్బా రామనామం అత్యద్భుతము
గొబ్బున నే భాగ్యశాలికబ్బునో రామనామమది అ..
చరణము(లు):
సారములేని సంసారసాగరమీదే రామనామం
పారదోలు మున్నూటరువది భవరోగములన్నీ అ..
చేరి పంచేంద్రియములన్ని చేరనియ్యదు రామనామం
ఘోరమైన యమదూతలకొట్టెడిది రామనామం అ..
దినదినము జిహ్వకింపై దీయగనుండు రామనామం
ధనకనక వస్తువులు దయచేయు రామనామం అ..
ముక్కంటిసతికి శాశ్వతకీర్తినిచ్చే రామనామం
ఎక్కువై వాల్మీకిఋషికి యెప్పుడనుష్ఠాననామం అ..
కామక్రోధలోభ మోహగర్వంబణచు రామనామం
స్వామి భద్రగిరీశుని సద్గతి శ్రీరామనామం అ..
నీమముతో బిలిచినను నిత్యమోక్ష పదవినామం
రామదాసునేలిన శ్రీరామచంద్రునినామం అ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - abbabbaa raamanaamaM atyadbhutamu ( telugu andhra )