| కీర్తనలు | భద్రాచల రామదాసు | అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య |
| వరాళి - రూపక ( - ఆది) |
| పల్లవి: |
| అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య॥ |
| చరణము(లు): |
| చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ చందాన బ్రోచెదవో రామయ్య॥ |
| వనజనాభుని మాయ తెలియకనే వెఱ్ఱివగల బొందుచుంటిగా కొన్నాళ్ళు॥ |
| మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే మునిగి తేలుచుంటిగా కొన్నాళ్ళు॥ |
| ఎనుబదినాల్గు లక్షల యోనులందెల్ల వేసరక పుట్టితిగా కొన్నాళ్ళు॥ |
| అయ్య ఆలంబనము లేక నాకాశమున నలసట నొందితిగా కొన్నాళ్ళు॥ |
| మేను తెలియగ లేక మిన్ను లోపల జిక్కి మినుకుగ నుంటినిగదా కొన్నాళ్ళు॥ |
| ఈలాగు వచ్చి మేఘమధ్యమునందు నిడుమల పడుచుంటిగా కొన్నాళ్ళు॥ |
| జాలినొంద సూర్యకిరణములో జొచ్చి చలనము నొందితిగా కొన్నాళ్ళు ॥ |
| వర్షములోజిక్కి వసుమతిమీదనె వర్తించుచుంటిగదా కొన్నాళ్ళు॥ |
| వరుస శషసస్యగతమైన ధాన్యముల వదలి వర్తించితిగా కొన్నాళ్ళు॥ |
| పురుషుడారగించు నన్నముతోనే నట్టు జేరియుంటిగా కొన్నాళ్ళు॥ |
| వరనరుని రేతస్సువల్ల నారీగర్భనరకమున బడియుంటిగా ఓరామ ॥ |
| ఆ త్రిప్పుడు తిత్తిలో బదినెలలు ప్రవర్తిల్లుచుంటినిగా కొన్నాళ్ళు॥ |
| అప్పుడు మాతల్లి యుప్పుపులుసుదిన నంగలార్చుచుంటి గదా కొన్నాళ్ళు॥ |
| ఎప్పుడు నిందుండి బయలు వెళ్ళుదునని ఎదురుచూచుచుంటిగదా కొన్నాళ్ళు॥ |
| చెప్పరానియట్టి ద్వారములోను బడి జననమొందితిని గదా రామయ్య॥ |
| పొరలు దుర్గంధపు పొత్తిళ్ళలోనలిగి వరలుచు నుంటిగదా కొన్నాళ్ళు॥ |
| పెరుగుచు బాల్యావస్థల కొన్నిదినములు పరుగులాడుచునుంటిగా కొన్నాళ్ళు॥ |
| లేతరుణులతో గూడి మదమత్సరంబులు తన్నెరుగలేనైతినిగదా కొన్నాళ్ళు॥ |
| తరువాత దారపుత్రాది మోహములదగిలి వర్తించితిగదా ఓ రామా ॥ |
| తెల్లతెల్లనై దంతము లూడివణకుచు తడబడుచుంటిగదా కొన్నాళ్ళు॥ |
| బలముదీరి కండ్లు పొరలు గప్ప పరుల బ్రతిమాలుచుంటిగదా కొన్నాళ్ళు॥ |
| అంతట మృతినొంది యలయుచు యమునిచే బాధలొందితిగా కొన్నాళ్ళు॥ |
| ఎంతగా నీరీతి పుట్టుచు గిట్టుచు వేదనబడుచుంటిగా కొన్నాళ్ళు॥ |
| కంజజనక భద్రాచలపతివగు నిన్ను గనలేక తిరిగితిగదా కొన్నాళ్ళు॥ |
| వింతగ నేరామదాసుడనైతిని నింకెట్లు బ్రోచెదవో ఓ రామా ॥ ఆధారము - రామదాసు కీర్తనలు సంపాదకులు: మంచాళ జగన్నాథరావు ఆంధ్రప్రదేశ్ సంగీతనాటక అకాడమీ, 1975 |