కీర్తనలు భద్రాచల రామదాసు ఆనంద మానందమాయెను శ్రీజానకి రామస్మరణ చేయగనే
నాదనామక్రియ - ఆది (పూరీకళ్యాణి - త్రిపుట)
పల్లవి:
ఆనంద మానందమాయెను శ్రీజానకి రామస్మరణ చేయగనే ఆ..
అను పల్లవి:
నేడార్యులకృప మాకు కలిగెను ఇప్పుడిరువ
దేడింటనున్న పరమాత్ముని జూడగానే ఆ..
చరణము(లు):
పరమభక్తి శ్రద్ధగల్గెను బహు
దురితజాలములెల్ల దొలగెను ఆ..
పటురాగ ద్వేషములెల్లవీడెను
ఇటు రాజయోగమున ఉన్న రాజును జూడగ ఆ..
పూర్వపుణ్యము లొనగూడెను శ్రీ
పార్వతి జపమంత్రమీడేరెను ఆ..
పూర్వకృతమ్బు కనబడెను పరమ
పావనమైన శ్రీహరి సేవగల్గె నేడు ఆ..
సామాన్యుల చెంత చేరము వట్టి
పామరజనుల నిక గూడము మేము అ..
కామబద్ధుల జేరి వేడము మాకు హరి
నామ స్మరణజేయు భాగవతులె దిక్కు ఆ..
రామభక్తుల జేరగల్గితిమి ఇతర
కామము లెల్లను వీడగల్గితిమి ఆ..
పరభామలపైని భ్రాంతిదొలగెను మేము
పరులదోషములెన్న మొరులను నెదురాడము ఆ..
ఇతర చింతనల చేయము వేరే
ఇతర దైవములను గొనియాడము మేము ఆ..
ధరాపతులకు మ్రొక్కింత సేయము
భద్రాచల రామసేవ మానము మానము ఆ..
భద్రాద్రి స్వామి మాకు దైవము వేరు
క్షుద్రదేవతలను దలపము దలపము ఆ..
దారిద్ర్యములనెల్ల మది నెంచము భద్ర
గిరి రామదాసునేలిన పరమదయాళుడుండ ఆ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - aanaMda maanaMdamaayenu shriijaanaki raamasmaraNa cheeyaganee ( telugu andhra )