| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా |
| కాంభోజి - ఆట (భైరవి - త్రిపుట) |
| పల్లవి: |
| ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా నా పామరత్వముచేత బ్రతిమాలికొనియెద రామచంద్రా ఆ.. |
| చరణము(లు): |
| తామసింపక యిత్తరి నను కృపజూడు రామచంద్రా తడయక మీ తల్లిదండ్రుల యానతీరు రామచంద్రా ఆ.. |
| సేవకునిగాచి చెయిపట్టి రక్షింపు రామచంద్రా చెలువుగ సీతాదేవి యానతీరు రామచంద్రా ఆ.. |
| కోరిక దయచేసి కొదువలు దీర్చుమో రామచంద్రా కొమరొప్ప మీకుల గురువులానదీరు రామచంద్రా ఆ.. |
| నెనరుంచి నామీద నిరతము బ్రోవుము రామచంద్రా వినయముగ సౌమిత్రి యానతీరు రామచంద్రా ఆ.. |
| వేడుకమీరగ వేగరక్షింపుమీ రామచంద్రా జోడుగ భరతశత్రుఘ్నుల యానతీరు రామచంద్రా ఆ.. |
| జంటగ మీవెంట బంటుగ నేలుము రామచంద్రా తంటలేక మీయింటి యానతీరు రామచంద్రా ఆ.. |
| ఆదరింపుము నన్ను అడియే\న్ దాసుడ రామచంద్రా వాదేల రామదాసుని బ్రోవుమిక శ్రీరామచంద్రా ఆ.. |