| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి |
| ఆనందభైరవి - ఏక |
| పల్లవి: |
| ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి రఘురాములతో నే పుట్టనైతిని శ్రీరాములతో బుట్టి సేవలు సేయగనైతిని ఆ.. |
| చరణము(లు): |
| దశరథనందనులై దాశరథి రాముల వశముగ బాలురతో వరదుడై యాడంగ వనజనాభునకు దాసుడనై నే భయభక్తితోడ సకల సేవలు సల్పుచు మఱియును అకట నలుగురితో నాడుకొందుగద ఆ.. |
| అయోధ్యాపురిలో గజమునెక్కి అచ్యుతుండురాగాను నాట్యమాడుచు నన్ను రక్షింపుమందును విశ్వామిత్రుని వెంటపోగా నేపోదును జనకుడు హరికి జానకిని పెండ్లిచేయగ వారిద్దరికి నే శేషబియ్యమునిత్తును ఆ.. |
| అమ్మవారికి ఆకులు మడిచి యిత్తును నరులార యితడే నారాయణుడని నే చాటుదును మనలను రక్షించే మాధవుడు వచ్చెనందును మనగతి యేమందు ప్రభుదశరథు నే బతిమాలుదుగద ఆ.. |
| కైకేయిని నేగాదనందుగద రామునికైన రాజ్యమిత్తుగద ప్రభువయి యేలగ నొనర్తుగద అడవికిపోగ నంటిపోదుగద ఆ.. |
| గుహునితో గూడుక కూడి మురియుదుగద నిలిచిదానవుల నెత్తిగొట్టుదుగద కరయుద్ధంబున గౌగిలింతుగద కనకమృగము రాగ గాంత తెమ్మంటె ఓ నిర్దయులార అయ్యోనేపోయి ఆ.. |
| ఆమృగమును దెచ్చి అమ్మకిత్తుగద హరినినేను పోవద్దందునుగద ఆమృగము వెంటదశముఖుడంతట తపోవేషమున దశముఖుతన శౌర్యముజూడగ జానకివణకగ ఆ.. |
| ఆరావణుడు సీతమ్మను చెఱపట్టగ అప్పుడు నేనుంటె అమ్మ కభయమిత్తును ఆశ్రిత పాదములు నట్టెపట్టుకనే మ్రొక్కుమను హరిదుఃఖింపగ అమ్మజాడదెత్తును ఆ.. |
| సర్వజ్ఞమూర్తి చాలు నీవిరహమందును విశ్వములోనందరు విననట్లూరుకుండిరి సురవరులందరు సుఖంబుగ చూచుచుండిరి అయ్యో యిదేమని ఆబ్రహ్మాదుల శపింతునుగద ఆ.. |
| మిత్రవంశున కేమిచేయును నే నెవ్వరివేడుదు ఏమరియుండిరి మానిసులందరు ఏలపోయెనో యా క్షీరాబ్ధికి ఏల దశరథుఁడు యజ్ఞముచేసెను ఆ.. |
| ఎందుకు బుట్టిరి యీలోకమునను ఎందుకువచ్చిరి యీవనమునకును ఇట్టి వరముల నేలవేడిరి యెక్కడనోపదు ఇంతటిజాలి ఆ.. |
| పంపాతీరమున బరిమార్చిరి కబంధుని ఇంపుగ శబరివిందులు యిష్టముతోజేసి ఇంద్రసూనునికి హితవు గావించి ఆంజనేయాంగద ముఖ్యాదులు ఆ.. |
| మంజులవాణికి మరువక వెదకగ వారలతోగూడి వెదకుదుగద వైదేహిని ప్రేమతోను సహాయముగ రమ్ము సంపాతిపోకముందును ఆ.. |
| సముద్రమునే చౌకళించి వేగదుముకుదును లంకను గాలించి పంకజాక్షిని నే సేవింతును అంగుళీయకమిచ్చి అమ్మా హరియిచ్చెనందును ఆ వృత్తాంతము హరికి నే విన్నవింతును ఆ.. |
| జానకీరామ జాగేల లేలెమ్మందును అపరాధిని నేనని వారికి వాహనము ఆంజనేయుడ ఆ లక్ష్మణునకు అంగదరాజ ప్రభురాములనే ప్రార్థించెదను గద ఆ.. |
| సేనలగూడుక చెండాడుదుగద కపులచే వారధి గట్టింతుగద సముద్రుడా యిది సమయమందుగద హరిసేవతో పనులాచరింతుగద ఆ.. |
| వలీముఖులకుగల బలము జూతుగద శుభరామునితో సొంపుకందుంగద లక్ష్మణాగ్రజుడు సేనను రావించి లక్ష్మికొరకు కపిలంక జుట్టంగ ఆ.. |
| రక్షించు భద్రాద్రివాస దాసుడనై రణములో రావణుని ద్రుంతును ఆ క్షణమున రఘువరునప్పుడే నే బిలుతును మంగళపతివ్రతను ఆ.. |
| మాధవుకర్పించి మురియుదును అమ్మకు మారుగ అగ్నిలో జొత్తును ఆ పుష్పకమెక్కి హరితో నయోధ్యకు బోదును భరతు డానందభరితుడై వేడుకొనగ ఆ.. |
| భోరున వాద్యములు భువనములునిండి మ్రోయగ పట్టాభిషేకము పరమఋషులు సేవింపగ జలజాక్షులు జయములు పాడంగ రాముల తొడపై లక్ష్మియుండగ ఆ.. |
| లక్ష్మణానుజులు వింజామర విసరగా వాయుసుతుడు పదవనజము లొత్తగా జేరి విభీషణ మహాత్మయనగా ఆర్ధికపులు హరిగోవిందయనగా ఆ.. |
| బ్రహ్మాదులు హరి ప్రస్తుతింపగా తల్లి మారుతికి దండవేయగా నాతల్లియప్పుడు నాకు వేయునుగద కష్టపడితినని కరుణించునుగద సీతారాములు సిరులిత్తురు గద ఆ.. |