| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను |
| కాంభోజి - ఆది (- త్రిపుట) |
| పల్లవి: |
| ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ.. |
| చరణము(లు): |
| చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ.. |
| గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ఇ.. |
| భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ.. |
| శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ఇ.. |
| లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ.. |
| సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ.. |
| వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగ న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా ఇ.. |
| కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా ఇ.. |
| మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా ఇ.. |
| అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా ఇ.. |
| సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా ఇ.. |
| ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా ఇ.. |
| కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచంద్రా కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా ఇ.. |
| భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచంద్రా ఇ.. |