కీర్తనలు భద్రాచల రామదాసు ఇనకులతిలక ఏమయ్య రామయ్యా
ఆహిరి - త్రిపుట
పల్లవి:
ఇనకులతిలక ఏమయ్య రామయ్యా
శ్రీరామచంద్రా విని వినకున్నావు
వినరాదా నామొర శ్రీరామచంద్రా ఇ..
చరణము(లు):
కనకాంబరధర కపటమేలనయ్యా
శ్రీరామచంద్రా జనకాత్మజా రమణా
జాగుసేయకు శ్రీరామచంద్రా ఇ..
దశరథసుత నాదశ జూడవయ్యా
శ్రీరామచంద్రా పశుపతి నుతనామ
ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా ఇ..
నీవేగతియని నెర నమ్మియున్నాను
శ్రీరామచంద్రా కావవే యీవేళ
కాకుత్స్థ కులతిలక శ్రీరామచంద్రా ఇ..
వైకుంఠవాసుడ విని బాధ మాన్పవే
శ్రీరామచంద్రా నీకంటె గతిలేరు
నిర్దయజూడకు శ్రీరామచంద్రా ఇ..
రామ భద్రశైలధామ శ్రీరామ
శ్రీరామచంద్రా వేమరు వేడెద
రామదాసుని బ్రోవ శ్రీరామచంద్రా ఇ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - inakulatilaka eemayya raamayyaa ( telugu andhra )