కీర్తనలు భద్రాచల రామదాసు ఎంతపని చేసితివి రామ నిన్నేమందు
నాదనామక్రియ - ఝంప
చరణము(లు):
ఎంతపని చేసితివి రామ నిన్నేమందు
నిన్నేమందు సార్వభౌమ రామ
పంతమా నామీద పరమపావన నామ
సంతోష ముడిపితివి సకలసద్గుణధామ ఎం..
నిన్నె దైవంబనుచు నమ్మి రామ
తిన్నగా దుఃఖముల జిమ్మి రామ
కన్నదినమని నెమ్మి నిన్ను సేవింపగా
నన్నిట్లు నట్టేట ముంచు టెరుగకపోతి ఎం..
అన్నన్న మాటాడవేరా నీ
కన్నులను నను జూడవేరా రామ
చిన్నెలన్నియు దరిగియున్న ఈ చిన్నన్న
గ్రన్న నను జూడుమాయన్న ఓ రామన్న ఎం..
భద్రాద్రివాసుడే మనుపు మము నిరుప
ద్రవముగ నుండుమనుచు రామ
భద్రనుత కరుణాసముద్ర యో శ్రీరామ
భద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితి ఎం..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - eMtapani cheesitivi raama ninneemaMdu ( telugu andhra )