| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఎంతో మహానుభావుడవు నీవు |
| వరాళి - రూపక (శంకరాభరణ - త్రిపుట) |
| పల్లవి: |
| ఎంతో మహానుభావుడవు నీవు ఎంతో చక్కని దేవుడవు ఎంతో.. |
| వింతలు చేసితి వీలోకమందున సంతత భద్రాద్రిస్వామి రామచంద్ర ఎంతో.. |
| చరణము(లు): |
| తొలివేల్పు జాంబవంతుని చేసినావు మలివేల్పు పవనజుగా చేసినావు వెలయ సూర్యు సుగ్రీవుగ చేసినావు అలనెల్ల సురల కోతుల జేసినావు ఎంతో.. |
| కారణ శ్రీ సీతగ జేసినావు గరిమశేషుని లక్ష్మణుని జేసినావు ఆ రెంటి భరత శత్రుఘ్నుల జేసినావు నారాయణ నీవు నరుడవైనావు ఎంతో.. |
| ఱాతికి ప్రాణము రప్పించినావు నాతి యెంగిలికానందించినావు కోతిమూకలనెల్ల గొలిపించినావు నీటిపై కొండల నిల్పించినావు ఎంతో.. |
| లంకపై దండెత్తి లగ్గెక్కినావు రావణ కుంభకర్ణుల ద్రుంచినావు పంకజాక్షిని సీత పాలించినావు లంకేశు దివ్యపుష్పక మెక్కినావు ఎంతో.. |
| పరగ నయోధ్యకు బరతెంచినావు పట్టాభిషిక్తుడవై పాలించినావు వర భద్రగిరియందు వసియించినావు ధరను రామదాసు దయనేలినావు ఎంతో.. |