కీర్తనలు భద్రాచల రామదాసు ఎవరు దూషించిననేమి మరి ఎవరు దూషించిననేమి
బిలహరి - ఆది
పల్లవి:
ఎవరు దూషించిననేమి మరి ఎవరు దూషించిననేమి
అవగుణముమాన్పి యార్చేరా తీర్చేరా
నవనీతచోరుడు నారాయణుడుండగ ఎ..
చరణము(లు):
పిమ్మట నాడిననేమి మంచి ప్రియములు పలికిననేమి
కొమ్మరో రమ్మని కోరిక లొసగెడి సమ్మతి నాపాలి సర్వేశ్వరుండుండగ ఎ..
వాని పంతము మాకేల వట్టివాదులతోడ పోరేల భాషించువారితో
పలుమారు పొందేల కాచి రక్షించెడి ఘనుడు రాముడుండగ ఎ..
అపరాధముల నెంచువారు మాకు ఉపకారులైయున్నారు
విపరీత చరితలు వినుచు నెల్లపుడు కపటనాటకధారి కనిపెట్టియుండగ ఎ..
వారి వన్నెలు సల్పనేల మూడువాసనలకు భ్రమయనేల
వాసిగ భద్రాద్రివాసుడై నిరతము భాసురముగ రామదాసుడై యుండగ ఎ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - evaru duushhiMchinaneemi mari evaru duushhiMchinaneemi ( telugu andhra )