| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఏటికి దయరాదు శ్రీరాములు నన్ను |
| ఆనందభైరవి - ఆది |
| పల్లవి: |
| ఏటికి దయరాదు శ్రీరాములు నన్ను ఏమిటికి రక్షింపవు శ్రీరాములు ఏ.. |
| చరణము(లు): |
| పరులను వేడను శ్రీరాములు నీకే కరములు చాచితి శ్రీరాములు ఏ.. |
| పండ్రెండేండ్లాయెనే శ్రీరాములు బంది ఖానలో యున్నాను శ్రీరాములు ఏ.. |
| అర్థము తెమ్మనుచు నన్ను శ్రీరాములు అరికట్టుచున్నారు శ్రీరాములు ఏ.. |
| తానీషా జవానులు శ్రీరాములు నన్ను తహశీలు చేసేరు శ్రీరాములు ఏ.. |
| ముచ్చటాడవేమి శ్రీరాములు నీవు ఇచ్చే యర్థములిమ్ము శ్రీరాములు ఏ.. |
| నీచే గాకున్నను శ్రీరాములు మా తల్లి సీతమ్మ లేద శ్రీరాములు ఏ.. |
| మాతల్లి సీతమ్మకైన శ్రీరాములు నే మనవి చెప్పుకొందునయ్య శ్రీరాములు ఏ.. |
| ఆశించిన దాసుని శ్రీరాములు నీకు పోషించు భారము లేదా శ్రీరాములు ఏ.. |
| నిన్ను నమ్మినానయ్య శ్రీరాములు గట్టిగ నా నెమ్మదిలో శ్రీరాములు ఏ.. |
| వెడలిటు రారేమి శ్రీరాములు మీకు విడిది భద్రాచలమా శ్రీరాములు ఏ.. |
| వాసిగ భద్రాద్రి శ్రీరాములు రామ దాసుని రక్షింపు శ్రీరాములు ఏ.. |