కీర్తనలు భద్రాచల రామదాసు ఓ రఘువీరా యని నేబిలిచిన
మధ్యమావతి - ఆది
పల్లవి:
ఓ రఘువీరా యని నేబిలిచిన
నోహో యనరాదా రామ
సారెకు వేసారి నా మది యన్యము
చేరదు యేరా ధీరా ఓ..
చరణము(లు):
నీటజిక్కి కరిమాటికి వేసరి
నాటకధర నీ పాటలు బాపగ
మేటి మకరితల మీటి కాచుదయ
యేటికి నాపై నేటికిరాదో ఓ..
మున్ను సభను నాపన్నత వేడుచు
నిన్ను కృష్ణయని యెన్నగ ద్రౌపది
కెన్నొ వలువలిడి మన్నన బ్రోచిన
వెన్నుడ నామొర వింటివొ లేదో ఓ..
బంటునైతినని యుంటె పరాకున
నుంటివి ముక్కంటి వినుత నామ
జంట బాయకను వెంట నుండుమని
వేడితి భద్రాచలవాసా ఓ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - oo raghuviiraa yani neebilichina ( telugu andhra )