కీర్తనలు భద్రాచల రామదాసు కంటినేడు మా రాములను కనుగొంటినేడు కం..
శంకరాభరణ - చాపు (మేచబౌళి - ఝంప)
పల్లవి:
కంటినేడు మా రాములను కనుగొంటినేడు కం..
చరణము(లు):
కంటి నేడు భక్తగణముల బ్రోచు మా
ఇంటి వేలుపు భద్రగిరినున్నవాని కం..
చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
కొలువుతీరిన మా కోదండరాముని కం..
తరణికులతిలకుని ఘననీలగాత్రుని
కరుణా రసము గురియు కందోయి గలవాని కం..
హురు మంచి ముత్యాల సరములు మెరయగా
మురిపెంపు చిరునవ్వుమోము గలిగినవాని కం..
ఘల్లు ఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయగ
తళుకుబెళుకు పాదతలము గలిగినవాని కం..
కరకు బంగారుచేల కాంతి జగములు గప్ప
శరచాపములు కేల ధరియించు స్వామిని కం..
ధరణిపై శ్రీరామదాసునేలెడు వాని
పరమపురుషుడైన భద్రగిరిస్వామిని కం..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - kaMTineeDu maa raamulanu kanugoMTineeDu kaM.. ( telugu andhra )