| కీర్తనలు | భద్రాచల రామదాసు | కలియుగ వైకుంఠము భద్రాచల |
| ఆనంద భైరవి - రూపక (- త్రిపుట) |
| పల్లవి: |
| కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము సేవింతము సేవింతము క.. |
| అను పల్లవి: |
| అలివేణులారా మీరానందముగ వేగ విలసితమైనట్టి వేడుకచూడరె క.. |
| చరణము(లు): |
| కాంచన సౌధములు మానికములు మించిన దూలములు వజ్రములు చెక్కించిన స్తంభములు పగడములని భ్రమియించు ద్వారములు అంచయాన మరియెంచ లేరు గాదె మంచి పచ్చలు కూర్చిన వాకిళ్ళు క.. |
| బంగారు గోపురములు దేవళముల వెలుగు మాణిక్యములు భేరి మృదంగాది నాదములు భాగవతుల సంకీర్తనలు రంగైన కల్యాణమంటపములు శృంగారమేమనిదెలియ విన్నవింతు క.. |
| తీరైన పురవీధులు సొగసైన కోనేరులు సోపానములు సకలఫల తరువు లుపవనములు నదులు ఋషి గంధర్వనివాసములు సరసిజాక్షి వినవే గోదావరిస్నానము సంపత్కరమై యొప్పినది క.. |
| చక్కని స్త్రీపురుషులు పట్టణమందు పిక్కటిల్లగ వింతలు బ్రాహ్మణులు మక్కువతో పూజలు వేదశాస్త్ర తార్కిక వైష్ణవులు గ్రక్కునవారిని కన్నులజూచిన ఎక్కువైన పుణ్యమేమని తెలుపుదు క.. |
| వామాక్షులాడగను సీతతో హేమపీఠమున సంపూర్ణకళలు మోమున వెలుగగ పరివారములు ప్రేమతో గొలువగను భద్రాద్రి రామదాసునేలు స్వామియైన శ్రీకోదండరాము నివాసము క.. |