కీర్తనలు భద్రాచల రామదాసు కోదండరామ కోదండరామ కోదండరామ కోట్యర్కధామ కో..
నాదనామక్రియ - ఏక (ఆనందభైరవి - తిశ్ర ఏక)
పల్లవి:
కోదండరామ కోదండరామ కోదండరామ కోట్యర్కధామ కో..
చరణము(లు):
నీదండనాకు నీవెందుబోకు వాదేలనీకు వద్దుపరాకు కో..
శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకొనరమ్ము ఆరోగ్యమిమ్ము కో..
జయ రఘువీర జగదేకశూర భయనివార భక్తమందార కో..
మణిమయభూష మహలక్ష్మితోష రణవిజయఘోష రమణీయవేష కో..
ఏలరావయ్య ఏమంటినయ్య పాలింపవయ్య ప్రౌఢిగనవయ్య కో..
తల్లివి నీవే తండ్రివి నీవే తాతవు నీవే దైవము నీవే కో..
అద్భుతకుండలామలదండ సద్గుణదండ సమరప్రచండ కో..
సరసిజనేత్ర సౌందర్యగాత్ర పరమపవిత్ర భవ్యచరిత్ర కో..
ఏ బుద్ధివీడు యెరుగనివాడు పాపడువీడు బడలియున్నాడు కో..
పాపను లేపు ప్రజలనుగల్పు యాపదబాపు యటుప్రీతిజూపు కో..
నమ్మిన చిన్నవాడితడన్న మమ్ములగన్న మాయన్నవన్న కో..
లేరుమీసాటి ఎవరుమీసాటి రారుమీసాటి రాజులమేటి కో..
దశరథబాల దాసానుకూల దశముఖకాల ధరణీశపాల కో..
మారుతభీమ మాల్యాభిరామ కల్యాణనామ కారుణ్యధామ కో..
మంజులభాష మణిమయభూష కుంజరపోష కువలయవేష కో..
పుట్టింపనీవె పోషింపనీవే ఫలమియ్యనీవె భాగ్యమునీవె కో..
శరణన్నచోట క్షమచేయుపూట బిరుదునీదౌట నెరిగినమాట కో..
మురళీలోల మునిజనపాల తులసీవనమాల తుంబురులోల కో..
రావయ్యవీని రక్షింతుగాని సేవచేసితిని స్వామి నీవని కో..
రావణభంగ రమణీయాంగ పావని తురంగ పాదాబ్జ గంగ కో..
మందారహార మన్మథాకార మహితవిచార మౌక్తికహార కో..
వందనమయ్య వాదేలనయ్య దండనసేయ తగదుమీకయ్య కో..
లాలితహాస లక్ష్మీవిలాస పాలితదాస భద్రాద్రివాస కో..
శ్రీవిజయరామ శ్రీతులసిధామ పావననామ భద్రాద్రిరామ కో..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - koodaMDaraama koodaMDaraama koodaMDaraama kooTyarkadhaama koo.. ( telugu andhra )