| కీర్తనలు | భద్రాచల రామదాసు | గోవింద సుందరమోహన దీనమందార |
| మోహన - చాపు ( - త్రిపుట) |
| పల్లవి: |
| గోవింద సుందరమోహన దీనమందార గరుడవాహన భవబంధాది దుష్కర్మ దహన భక్తవత్సల త్రిలోకపావన గో.. |
| చరణము(లు): |
| సతిసుతులపై ప్రేమరోసితి సం తతము మీపై భారమువేసితి మదిలోన మిముగనుల జూడగ నెంచి మీదయకెపు డెదురెదురు జూచితి గో.. |
| చాలదినములనుండి వేడితినే కాలహరణముచేసి గనలేనైతి మేలు నీనామముబాడితి మేలుగా ముందటి విధమున వేడితి గో.. |
| దీనరక్షకుడవని వింటిని నీ కనికర మేతీరున గందును మానస మున నమ్మియుందును నా మనవి చేకొనవేమందును గో.. |
| అధికుడవని నమ్మినందుకు ఆశ్ర యించిన శ్రమపెట్టేదెందుకు మిము వెదకి తెలిసేదెందుకు మాకిది పూర్వకృత మనేటందుకు గో.. |
| క్రోధాన వచ్చెను వార్ధక్యము ఇక ప్రాపేది బహుసామీప్యము పదములు విడనందు గోప్యమా మీరెపు డు చూపెదరు స్వరూపము గో.. |
| భద్రగిరియందు లేదేమొ యునికి భక్తుల మొరవిని రావేమొ కరిగాచి న హరివిగాదేమో రామ దాసుని మొరవిని రావేమో గో.. |