కీర్తనలు భద్రాచల రామదాసు జానకిరమణ కళ్యాణసజ్జన నిపుణ, కళ్యాణసజ్జన నిపుణ శ్రీరామా
పున్నాగవరాళి - ఆది (కాపి - త్రిపుట)
పల్లవి:
జానకిరమణ కళ్యాణసజ్జన నిపుణ, కళ్యాణసజ్జన నిపుణ శ్రీరామా జా..
చరణము(లు):
ఓనమాలు రాయగానే నీనామమే తోచు, నీనామమే తోచు శ్రీరామా జా..
ఎందుజూచిన నీదు అందమే గానవచ్చు, అందమే గానవచ్చు శ్రీరామా జా..
ముద్దుమోమునుజూచి మునులెల్ల మోహించిరి, మునులెల్ల మోహించిరి శ్రీరామా జా..
దుష్టులు నినుజూడ దృష్టితాకును ఏమో, దృష్టితాకును ఏమో శ్రీరామా జా..
ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవె, నిన్నే భజింప నీవె శ్రీరామా జా..
ముక్తి నేనొల్ల నీదు భక్తి మాత్రము చాలు, భక్తి మాత్రము చాలు శ్రీరామా జా..
రాతినాతిగజేసె నీతిరువడిగళెగాదా, నీతిరువడిగళెగాదా శ్రీరామా జా..
నారదాది మునులు పరమపద మందిరిగద, పరమపద మందిరిగద శ్రీరామా జా..
సత్యస్వరూపముగ బ్రత్యక్షమైనావు, బ్రత్యక్షమైనావు శ్రీరామా జా..
భద్రాచలనివాస పాలిత రామదాస, పాలిత రామదాస శ్రీరామా జా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - jaanakiramaNa kaLyaaNasajjana nipuNa, kaLyaaNasajjana nipuNa shriiraamaa ( telugu andhra )