| కీర్తనలు | భద్రాచల రామదాసు | తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు త.. |
| నాదనామక్రియ - ఆది (సౌరాష్ట్ర - ఆది) |
| పల్లవి: |
| తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు త.. ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారియై చెంతనె యుండగ త.. |
| చరణము(లు): |
| మ్రుచ్చుసోమకుని మునుజంపినయా మత్స్యమూర్తి మనపక్షమునుండగ త.. |
| సురలకొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగ త.. |
| దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన వరాహమూర్తి మనవాడై యుండగ త.. |
| హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా పరచిన నరహరి ప్రక్కన నుండగ త.. |
| భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ త.. |
| ధరలో క్షత్రియులను దండించిన పరశురాముని దయ మనకుండగ త.. |
| దశగ్రీవు మును దండించిన యా దశరథరాముని దయ మనకుండగ త.. |
| ఇలలో యదుకులమున నుదయించిన బలరాముడు మన బలమైయుండగ త.. |
| దుష్టకంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతోనుండగ త.. |
| కలియుగాంత్యమున కలిగిన దైవము కలికిమూర్తి మము గాచుచు నుండగ త.. |
| నారాయణదాసుని గాచిన శ్రీమన్ నారాయణు నెరనమ్మియుండగ త.. |
| రామదాసు నిల రక్షించెదనని ప్రేమతో పలికిన ప్రభువిట నుండగ త.. |