కీర్తనలు భద్రాచల రామదాసు తగునయ్య దశరథ రామచంద్ర దయ దలుపవేమి నీవు
శంకరాభరణము - రూపక (- త్రిపుట)
పల్లవి:
తగునయ్య దశరథ రామచంద్ర దయ దలుపవేమి నీవు
పగవాడనా యెంతో బతిమాలిననుగాని పలుకవేమి నీవు త..
చరణము(లు):
నగుమోము జూపరా నాయన్నా
నిను చాలా నమ్మినాను ఇంత
అగడుగ జూచిన నావంక
ఎవరిపాలయ్యా నేను త..
పతితులనెల్ల పావనుల జేయుదు
నని పలుకవేల యిపుడు
అతిఘోర ఖలుండననుచు
నన్ను విడనాడనేల త..
మన్నించి కావరాకున్నావు
ఓ రామ నిన్ను మాననే
నిన్నేగాని పరులనెన్నబోను
నా కన్నులార త..
పదపడి మిము జేరబడిన
వారల చేపట్టలేదా నన్ను
వదలిన మీవంటివారికి
యపకీర్తికాదా త..
అనుదినము భద్రాద్రి
రాముడవని నిన్నరసినాను
నేను వినయముతో రామదాసుడ
నని విన్నవించినాను త..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - tagunayya dasharatha raamachaMdra daya dalupaveemi niivu ( telugu andhra )