కీర్తనలు భద్రాచల రామదాసు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా
ధన్యాసి - ఆది
పల్లవి:
తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా
అను పల్లవి:
మీరిన కాలుని దూతలపాలిటి
మృత్యువుయని మదినమ్ముక యున్న తా..
చరణము(లు):
మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా
హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా
ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా
వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు తా..
ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్న
అన్ని రూపులై యున్న నాపరాత్పరు నామహాత్ముని కథ విన్నా
ఎన్ని జన్మములజేసిన పాపములీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా తా..
నిర్మల మంతర్లక్ష్యభావమున నిత్యానందముతోనున్న
కర్మంబులువిడి మోక్షపద్ధతిని కన్నుల నే జూచుచునున్న
ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్న
మర్మము దెలిసిన రామదాసుని హృన్మందిరముననే యున్న తా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - taaraka maMtramu koorina dorikenu dhanyuDanaitini oorannaa ( telugu andhra )