కీర్తనలు భద్రాచల రామదాసు నమ్మినవారిని మోసముచేయుట న్యాయముగాదుర నాతండ్రి
భైరవి - తిశ్ర ఏక
చరణము(లు):
నమ్మినవారిని మోసముచేయుట న్యాయముగాదుర నాతండ్రి
సమ్మతమౌనా చూచేవారికి చక్కన గాదుర రఘునాథా న..
విన్నారంటే పరులందరు నిను విడనాడుదురే రఘునాథా
అన్నా నీకిది చిహ్నము గాదుర ఆదుకోవలెనురా రఘునాథా న..
నిన్నా నేడా నిన్ను కొలిచేది నీకేల తెలియదు రఘునాథా
ఎన్నాళ్ళీ కష్టము పడుదు నిక తాళనురా రఘునాథా న..
డబ్బులకై నేను దెబ్బలు పడినది దబ్బర గాదుర రఘునాథా
నిబ్బరముగ రామదాసు నేలుచు మాయబ్బ తాళనురా రఘునాథా న..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - namminavaarini moosamucheeyuTa nyaayamugaadura naataMDri ( telugu andhra )