| కీర్తనలు | భద్రాచల రామదాసు | నరహరిని నమ్మక నరులను నమ్మితె నరజన్మమీడేరునా ఓ మనసా న.. |
| జంఝాటి - ఆట (ఝంఝోటి- ఆది) |
| పల్లవి: |
| నరహరిని నమ్మక నరులను నమ్మితె నరజన్మమీడేరునా ఓ మనసా న.. |
| అను పల్లవి: |
| చెఱకులుండగ వెఱ్ఱి చెఱకులు నమలితె జిహ్వకు రుచిపుట్టునా ఓమనసా న.. |
| చరణము(లు): |
| కాళులుండగ మోకాళ్ళతో నడచితె కాశికిపోవచ్చునా ఓమనసా నీళ్ళుండగ నుమ్మి నీళ్ళను మ్రింగితే నిండుదాహము దీరునా ఓమనసా న.. |
| కొమ్మయుండగ గొయ్యబొమ్మను గలసితె కోరిక కొనసాగునాఓమనసా అమ్మయుండగ పెద్దమ్మను యడిగితె నర్థము చేకూరునా ఓమనసా న.. |
| అన్నముండగ గుల్లసున్నము తింటె యాకలి వెతదీరునా ఓమనసా కన్నెలుండగ చిత్రకన్నెల గలసిన కామపువ్యథ దీరునా ఓమనసా న.. |
| క్షుద్రబాధలచే నుపద్రవపడువేళ నిద్రకంటికి వచ్చునా ఓమనసా భద్రగిరీశుపై భక్తిలేని నరుడు పరమును గననేర్చునా ఓమనసా న.. |