| కీర్తనలు | భద్రాచల రామదాసు | నారాయణ యనరాదా మీ |
| నాదనామక్రియ - త్రిపుట |
| పల్లవి: |
| నారాయణ యనరాదా మీ నాలికపై ముల్లు నాటియున్నదా నా.. |
| చరణము(లు): |
| పనిలేని వార్తలు నూరు యట్టే పలుమారు వాదించి పలుకుచున్నారు మనసున వెతలెల్ల తీరు మీ జననము లీడేర జనులార మీరు నా.. |
| ఆలుబిడ్డల పొందు బాసి వట్టి అడవిలోపల పండుటాకులు మేసి జాలిచెందుట వట్టిగాసి లెస్స సంసారియైయుండి సమబుద్ధిజేసి నా.. |
| తొడరి చిక్కులు బుట్టు తాను బుద్ధి బొడమ నీయడు ఒక గడియైనాను అడలి సంసారములోను చిక్కు బడనేల నీ బుద్ధి బంగారుగాను నా.. |
| కలుషవారధికి నావ నిన్ను గలిసేటందుకు చక్కని బాట త్రోవ ఇలలో తెలివికి దేవదేవ నరహరి నామకీర్తనములె లేవ నా.. |
| కామక్రోధముల చాలించి పూర్వ కర్మబంధములెల్ల తుదముట్ట త్రెంచి శ్రీమంతుడై భక్తిగాంచి భద్రాచలరామదాసుని మదిలోన యెంచి నా.. |