కీర్తనలు భద్రాచల రామదాసు నిను బోనిచ్చెదనా సీతారామ
మధ్యమావతి - చాపు ( -త్రిపుట)
పల్లవి:
నిను బోనిచ్చెదనా సీతారామ
నిన్ను బోనిచ్చెదనా సీతారామ ని..
అను పల్లవి:
నిన్ను బోనిచ్చెదనా నన్ను రక్షింపక ఏ
మైనగాని నా కనులాన శ్రీరామా ని..
చరణము(లు):
రట్టు చేసెద నిన్ను అరికట్టుదునింక మొర
బెట్టుకోరా దిక్కు గలిగితే రామ ని..
గట్టిగ నీ పదకమలము లెప్పుడు
పట్టి నా మదిలో గట్టియుందును శ్రీరామా ని..
పడిపడి మీ వెంటబడి తిరుగ నెంతో
జడియను నీవెందు జరిగెదవురా రామ ని..
తడయక నీ తల్లితండ్రులు వచ్చినగాని
విడిచిపెట్టిన నీకొడుకునురా శ్రీరామా ని..
మా వాడని మొగమాటము లేక నే
సేవజేసి రవ్వ సేయుదురా రామ ని..
నీవు భద్రాచల నిలయుడవై నన్ను
కావవయ్యా రామదాస పోషక శ్రీరామా ని..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - ninu boonichchedanaa siitaaraama ( telugu andhra )