కీర్తనలు భద్రాచల రామదాసు నీసంకల్పం బెటువంటిదో గన నెంతవాడరా రామా నీ..
పూరికల్యాణి - ఆది
పల్లవి:
నీసంకల్పం బెటువంటిదో గన నెంతవాడరా రామా నీ..
వాసి తరిగి నీ దాసజనులు భువి గాసిపడిన యాఘనమెవ్వరిదో నీ..
చరణము(లు):
బ్రోచిన మరివిడ జూచిన నీ కృపగాచి యుండుగాని
తోచితోచకను తొడరికరంబుల చాచి పరుల నే యాచనసేయను నీ..
పటుతరముగ నీ మటుమాయలకును నెటువలె నోర్తును
చటులతరంబుగ జెలగు భవాంబుధి నెటుదాటుదు నేనెవరిని దూరుదు నీ..
భావజరిపునుత పరమపురుష నీ భావము దెలియదుగా
దేవదేవ నీ సేవక జనులకు సేవకుడను ననుగావుము మ్రొక్కెద నీ..
దరిజేర్చెదవని ధైర్యముచే నీదరి జేరితిగాని
అరసి బ్రోవగదె యారడిబెట్టుట లెరుగనైతి నా దొరవనుకొంటి నీ..
శరణాగత రక్షణ భవసాగర తరణా రిపుహరణా
కరుణజూడు భద్రాద్రినివాసా అరమరచేయకు హరినిను నమ్మితి నీ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - niisaMkalpaM beTuvaMTidoo gana neMtavaaDaraa raamaa nii.. ( telugu andhra )