కీర్తనలు భద్రాచల రామదాసు పలుకే బంగారమాయెనా
ఆనందభైరవి - రూపక
పల్లవి:
పలుకే బంగారమాయెనా కోదండపాణి ప..
చరణము(లు):
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీనామ స్మరణ మరువ చక్కని తండ్రి ప..
ఇరువుగ నిసుకలోన బొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి ప..
రాతి నాతిగజేసి భూతలమందున ప్ర
ఖ్యాతిజెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ప..
ఎంతవేడినను నీకు సుంతైన దయరాదు
పంతముచేయ నేనెంతటివాడను తండ్రి ప..
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భద్రాచల వరరామ దాసపోష ప..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - palukee baMgaaramaayenaa ( telugu andhra )