| కీర్తనలు | భద్రాచల రామదాసు | పావన రామనామ సుధారసపానముజేసేదెన్నటికో |
| కాపి- ఆది |
| పల్లవి: |
| పావన రామనామ సుధారసపానముజేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో పా.. |
| చరణము(లు): |
| దాసులగని సంతోషమ్మున తన దాసోహమ్మను టెన్నటికో భూసుతకును నతి ప్రాణప్రదంబగు పురుషోత్తము గనుటెన్నటికో పా.. |
| చంచలగుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో పంచతత్వములు తారకనామము పఠియించుట నా కెన్నటికో పా.. |
| ఇనవంశాంబుధి చంద్రుడు కృప నిష్టార్థము లొసగేదెన్నటికో కనకచేలు కరుణాలవాలుని కన్నుల జూచేదెన్నటికో పా.. |
| వంచన లేకను భద్రాద్రీశుని వర్ణన చేసేదెన్నటికో అంచితముగ రామదాసుడ ననుకొని ఆనందించేదెన్నటికో పా.. |