కీర్తనలు భద్రాచల రామదాసు పాహిమాం శ్రీరామయంటే పలుకనైతివి నీ
యదుకులకాంభోజి - ఆది
పల్లవి:
పాహిమాం శ్రీరామయంటే పలుకనైతివి నీ
స్నేహ మిట్టిదని నే చెప్పనోహో హోహో హోహో ఓహో పా..
చరణము(లు):
ఇబ్బంది నొందిన యా కరి బొబ్బపెట్టినంతలోనె
గొబ్బున గాచితివట జాగుసేయక ఎంతో
నిబ్బరముతోనే నీకు కబ్బమిచ్చి వేడుకొన్న
తబ్బిబ్బు జేసెదవు రామా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పా..
సన్నుతించిన వారినెల్ల మున్ను దయతో బ్రోచితివని
పన్నగశాయి విని నే విన్నవించితిని
విన్నపము వినక యెంతో కన్నడ జేసెదవు రామ
యెన్నటికి నమ్మరాదు రన్న న్నన్నన్నన్నన్నా పా..
చయ్యన భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను
వెయ్యారు విధముల రామ వినుతిచేయ సాగితిని
యియ్యెడను రామదాసుని కుయ్యాలించి ప్రోవకున్న నీ
యొయ్యార మేమనవచ్చు నయ్య య్యయ్యయ్యయ్యయ్యయ్యో పా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - paahimaaM shriiraamayaMTee palukanaitivi nii ( telugu andhra )