| కీర్తనలు | భద్రాచల రామదాసు | బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటి పోరా రామా |
| మధ్యమావతి - ఆట (కేదారగౌళ - ఆది) |
| పల్లవి: |
| బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటి పోరా రామా తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా రామా బి.. |
| చరణము(లు): |
| మురియుచు నీధర జెప్పినట్లు విన ముచికుందుడ గాను రామా అరుదుమీరలని తలచి ఎగురగా హనుమంతుడ గాను రామా సరగున మ్రుచ్చుల మాటలు విన జాంబవంతుడను గాను రామా బిరబిర మీ వలలోబడ నేనా విభీషణుడ గాను రామా బి.. |
| మాయలచేత వంచింపబడగ నే మహేశుడను గాను రామా న్యాయములేక నే నటునిటు దిరుగను నారదుండ గాను రామా ఆయము చెడి హరి నిను గని కొలువను నర్జునుండ గాను రామా దాయాదుండని మదిలో మురియను దశరథుడను గాను రామా బి.. |
| గరిమతోడ మాసీతను గాచిన గొప్పలు నే వింటి రామా పరగ భద్రగిరి శిఖరనివాసా పర బల సంహార రామా నరహరి నను రక్షింపుమయా శ్రీనారాయణరూపా రామా మరచి నిదురలోనైనను మీపద సరసిజములు విడువ రామా బి.. |