కీర్తనలు భద్రాచల రామదాసు భళి వైరాగ్యంబెంతో బాగైయున్నది చం
నాదనామక్రియ - ఆది (చక్రవాకం - త్రిపుట)
పల్లవి:
భళి వైరాగ్యంబెంతో బాగైయున్నది చం
చలమైన నామనసు నిశ్చలమైయున్నది భ..
చరణము(లు):
అరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీ
హరినామస్మరణ జిహ్వకు అనువైయున్నది భ..
గురుధ్యానమున మనసు కుదురైయున్నది చిత్త
మిరువది యారింటిమీద నిరవైయున్నది భ..
పరమశాంత మెన్నగను బాగైయున్నది మాకు
పరతత్త్వమందే మా బుద్ధిపట్టియున్నది భ..
విరసము పోరులేని విధమైయున్నది మాకు
ప్రకృతి యెడబాసి మోక్షమునకిరవై యున్నది భ..
గురి భద్రాద్రీశునందే గురువైయున్నది యిప్పుడు
అరమరలేక రామదాసు డనదగియున్నది భ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - bhaLi vairaagyaMbeMtoo baagaiyunnadi chaM ( telugu andhra )