| కీర్తనలు | భద్రాచల రామదాసు | భారములన్నిటికి నీవె యనుచు నిర్భయుడనై యున్నానురా రామ భా.. |
| ఆనందభైరవి - ఆది (-త్రిపుట) |
| పల్లవి: |
| భారములన్నిటికి నీవె యనుచు నిర్భయుడనై యున్నానురా రామ భా.. |
| అను పల్లవి: |
| దారిదప్పక నీవు దరివని ధైర్యముదోచినదిరా శ్రీరామా భా.. |
| చరణము(లు): |
| అతిదుష్కృతముల నేనెన్నో చేసితిని అయిన మరేమాయెరా రామా పతితపావనుడను బిరుదు వహించిన నీ ప్రఖ్యాతి విన్నానురా శ్రీరామా భా.. |
| ఏరీతినైన నే నిన్ను నమ్మియున్నాడ న న్నేలుకొనుట కీర్తిరా రామా నేరను నేరము లెంచి చూచుటకు నే నెంతవాడనుర శ్రీరామా భా.. |
| మును నినుచేరి కృతార్థులైనవారి ముచ్చట విన్నానురా రామా విని విననట్లున్నావేమిరా పలుమారు విన్నవించ నేరనురా శ్రీరామా భ.. |
| శరణన్నవారి రక్షణచేయు బిరుదు నిశ్చయమై నీకున్నదిరా రామా మురిపెముగా నన్నిటికి నే పట్టినది మునగకొమ్మకాదురా శ్రీరామ భా.. |
| బహువిధముల నిన్ను బ్రస్తుతించమని బ్రహ్మవ్రాసినాడురా రామ విహిత జనములలో నేనెవ్వడో యని వేరుచేయక బ్రోవరా శ్రీరామా భా.. |
| వాసిగ భద్రాచలేశుడవని చాల వర్ణించుచున్నానురా రామా భాసురముగ రామదాసు నేలునట్టి భావముగన్నానురా శ్రీరామా భా.. |