| కీర్తనలు | భద్రాచల రామదాసు | రక్షించు రక్షించు రక్షించు రక్షించు |
| కాంభోజి - త్రిపుట |
| పల్లవి: |
| రక్షించు రక్షించు రక్షించు రక్షించు రామచంద్రా నన్ను శిక్షింప వచ్చిరి శీఘ్రముగ కృప జూడు రామచంద్రా ర.. |
| చరణము(లు): |
| రాచకార్యమేమొ రచ్చకు వచ్చెను రామచంద్రా నన్ను రాజ రాజవన రాపు చేసెదవేల రామచంద్రా ర.. |
| కలకాలము నిన్ను కాంక్షించి వేడితి రామచంద్రా యే ఫలముగాననైతి పాలించి బ్రోవవే రామచంద్రా ర.. |
| ధర్మాత్ముడవని తలపోసితినయ్య రామచంద్రా యింత నిర్మోహివగుట నే నెరుగలేనైతి రామచంద్రా ర.. |
| పార్థివముఖ్య పౌరుషయుత శ్రీ రామచంద్రా నిన్ను ప్రార్థించి వేడెద పక్షముంచగదయ్య రామచంద్రా ర.. |
| కరుణమారి భటులు కఠినోక్తులాడగ రామచంద్రా నీ కరుణాకటాక్షము కానరాదాయెను రామచంద్రా ర.. |
| ప్రేమ భద్రశైలధాముడవై నీవు రామచంద్రా శ్రీరామదాసును వేగ రక్షింప రావయ్య రామచంద్రా ర.. |