కీర్తనలు భద్రాచల రామదాసు రక్షించుదీనుని రామరామ నీ రమణితోడు నన్ను
పున్నాగవరాళి - ఆది (- త్రిపుట)
పల్లవి:
రక్షించుదీనుని రామరామ నీ రమణితోడు నన్ను
రక్షింపకున్నను మీతండ్రి దశరథరాజు తోడు ర..
చరణము(లు):
అరుదుమీరగ విభీషణుని బ్రోచితివల్లనాడు అట్లు
కరుణింపకున్నను మీతల్లి కౌసల్యాదేవి తోడు ర..
గిరికొన్న ప్రేమ సుగ్రీవు బ్రోచితివి అల్లనాడు అట్లు
సిరులియ్యకున్నను మీకులగురువు వసిష్ఠుని తోడు ర..
అలివేణి యహల్య శాపము బాపితి వల్లనాడు అట్లు
కలుషములన్నియు బాపకున్న లక్ష్మణుని తోడు ర..
పాపాత్ముడైన కబంధు బ్రోచితి వల్లనాడు అట్లె
నెపములెన్నక కృపజూడకున్న మీయింటితోడు ర..
వదలక నీమీదనే నానలు పెట్టవలసె నేడు
భద్రాచల రామదాసుని యేలకున్న నీ పాదము తోడు ర..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raxiMchudiinuni raamaraama nii ramaNitooDu nannu ( telugu andhra )