కీర్తనలు భద్రాచల రామదాసు రక్షింపు మిది యేమొ రాచకార్యముపుట్టె రామచంద్ర
శంకరాభరణ - రూపక ( - త్రిపుట)
పల్లవి:
రక్షింపు మిది యేమొ రాచకార్యముపుట్టె రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర ర..
చరణము(లు):
అప్పులవారితో అరికట్టుకొన్నారు రామచంద్రస్వామి
చెప్పశక్యముకాదు చక్షుర్గోచరమాయె రామచంద్ర ర..
పక్షివాహన నన్ను పాలింపదయజూడు రామచంద్రస్వామి
అక్షయకటాక్ష మభిమానముంచవే రామచంద్ర ర..
కుక్షిలో మీమీద కోరికపుట్టెను రామచంద్రస్వామి
యిక్ష్వాకుకులతిలక యికనైనగావవే రామచంద్ర ర..
అధికుని చేపట్టి తడ్డమేమనుకొంటి రామచంద్రస్వామి
అధములకన్నను అన్యాయమైపోతి రామచంద్ర ర..
భయమేమి నే రామదాసుడ ననుకొంటి రామచంద్రస్వామి
భయముబాపి బ్రోవు భద్రాద్రిపురి నిలయ రామచంద్ర ర..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raxiMpu midi yeemo raachakaaryamupuTTe raamachaMdra ( telugu andhra )