కీర్తనలు భద్రాచల రామదాసు రామ నీదయరాదుగా పతితపావన
వరాళి - ఆది (శహన - త్రిపుట)
పల్లవి:
రామ నీదయరాదుగా పతితపావన
నామమే నీ బిరుదుగా శ్రీరామా రా..
చరణము(లు):
సామజవరదా నిన్నేమని దూరుదు
ఏమి యదృష్టమో ఎంతవేడిన రావు రా..
ఈవులడుగ జాలగా శ్రీపాద
సేవ మాకు పదివేలుగా రామ
భావజ జనక నీ భావము దెలిసియు
నీవు దైవమనుచు నేనమ్మియున్నాను రా..
నీకే మరులుకొంటిగా నే నితరు
లకు లోనుగాక యుంటిగా రామా
ఆకొన్నవాడనై యనవలసియుంటిగాని
నీకు దయరాకున్న నేనేమిచేయువాడ రా..
ప్రేమ నిబ్బరమాయెగా భద్రాచల
ధామాయని మేమో మాయెగా రామా
భూమిజ నాయక నా స్వామి నీవనుచు
కామించి సేవించు రామదాసుని బ్రోవ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raama niidayaraadugaa patitapaavana ( telugu andhra )