కీర్తనలు భద్రాచల రామదాసు రామ రామ నీవే గతిగద సంరక్షణంబు చేయ
ముఖారి - ఆది
పల్లవి:
రామ రామ నీవే గతిగద సంరక్షణంబు చేయ
వేమనందు హా దైవమ నీ మనసింక కరుగదాయె శ్రీ రా..
చరణము(లు):
పుడమిలోన నావంటి అభాగ్యుడు
పుట్టడింకనంటి రామ
విడువబోకు మయ్యాయని మున్నే
విన్నవించుకొంటినయ్యా రామ రా..
ఎన్నివిధంబుల పిలిచిన పలుకవు
ఏమదృష్టమంటి రామ
ఎన్నరాని వైవశ్యత వేదన
కెట్లు తాళుకొందు రామ రా..
న్యాయమటయ్యా మ్రొక్కగ నా మొర
యాలకించి రావు రామ
శ్రీయుతముగ నిను నమ్మినదాసుల
కోర్కెల నొసగినావు రా..
స్వామినేను నీవాడను నాయెడ
చలము చేయకయ్యా రామ
ప్రేమమీరగను నిను గొనియాడెద
మోము జూపవయ్యా రామ రా..
నేను మొప్ప భద్రాచలమందిర
నిన్ను నమ్మలేదా రామ
ప్రేమజూడు నీ బంటును శ్రీరామ
దాసు నేలరాదా రామ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raama raama niivee gatigada saMraxaNaMbu cheeya ( telugu andhra )