| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామ రామ యని నోట రవ్వంత సేపైన |
| కళ్యాణి - ఆది |
| పల్లవి: |
| రామ రామ యని నోట రవ్వంత సేపైన నీమము తప్పక మంచి నీతితో పల్కని వా డున్మత్తుడు మూఢచిత్తుడు రా.. |
| చరణము(లు): |
| దేహమశాశ్వతమని తెలియక దుర్బుద్ధిచేత సాహసమున సాధుజనుల సంకటబెట్టెడివాడు పాతకి బ్రహ్మఘాతకి రా.. |
| దుర్బుద్ధిచేత నేను దండించగలనని చాలా చెండితనమున పరుల దండింప గోరెడివాడు నిక్కునా భువిలో దక్కునా రా.. |
| మన్ననతో పిన్నపెద్దల కనుల కానకను భాగ్య మున్నదని గర్వమున అన్నము బెట్టనివాడు హీనుడు దుస్సంధానుడు రా.. |
| దూరభారము తెలియలేక దుర్బుద్ధి తలపోసి మేరతప్పి పరసతుల మెల్లన పొందెడివానికి మోసము చాల దోషము రా.. |
| స్నేహము చేసినవానికి ద్రోహము చేసినవాని కూహకమున యమదూతలు కుత్తుకలు మండుకత్తుల కోతురు కొరత వేతురు రా.. |
| రామదాసునేలినట్టి ప్రేమగల శ్రీభద్రశైల రామచంద్రుల కామించి రక్షించుమని కొలువక గొబ్బున మోక్షమబ్బున రా.. |