| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామ రామ శ్రీరామ రామరామ యనరాదా మనసా |
| ధన్యాసి - ఆది (ఖమాచ్ - ఆది) |
| పల్లవి: |
| రామ రామ శ్రీరామ రామరామ యనరాదా మనసా కామిత ఫలదుండగు శ్రీ సీతాకాంతుని గనరాదా మనసా రా.. |
| చరణము(లు): |
| సలలితముగ రఘువరునకు సింహాసన మియ్యగరాదా మనసా నళినభవాభవ పరివేష్ఠితు ధ్యానము చేయగరాదా మనసా రా.. |
| బలుడౌ రాముని రమ్మని యావాహన చేయగరాదా మనసా వెలయగ పాద్యము శ్రీభద్రాచల భవనునకీరాదా మనసా రా.. |
| ఆదిత్యార్చితుడగు శ్రీరాముని కర్ఘ్యం బియ్యగరాదా మనసా వేదవేద్యునకు ఆగమోత్తముకు వస్త్రములియ్యగరాదా మనసా రా.. |
| నాదస్వరూపుని కర్ధమెయని స్నానమొనర్పగరాదా మనసా పాదార్చిత భూవిభున కద్భుతవస్త్రము లీయగరాదా మనసా రా.. |
| భూతదయాధిపునకు నీవెపుడుపవీతం బియ్యగరాదా మనసా ఖ్యాతిగ దశరథసుతునకు శ్రీగంధంబిపుడీయగరాదా మనసా రా.. |
| కేతకికుసుమములు జాలును నీకివె యని యనరాదా మనసా శ్రీతులసీ దళములు కొని నీ వాశ్రితవరునకీరాదా మనసా రా.. |
| కపిలఘృతంబున ధూపదీపములు గావింపగరాదా మనసా నృప సత్తమునకు దీపారాధన మిపుడీయగరాదా మనసా రా.. |
| తపసుల పాలిటి వానికి నైవేద్యము చేయగరాదా మనసా కృపణవిరోధికి తాంబూలంబులు నిపుడె యీయగరాదా మనసా రా.. |
| నృత్యగీత వాద్యంబుల నాతని తృప్తుచేయగరాదా మనసా చిత్తజ జనకుని మత్తతలేకను హత్తియుండరాదా మనసా రా.. |
| మెత్తనిశయ్యను మేలగుదిండ్లను నొప్పుగనీరాదా మనసా ఎత్తరినైనను మరువక శ్రీహరి భక్తి సలుపరాదా మనసా రా.. |
| రాముడు కొలువై యుండెడువేళ పరాకు చెప్పరాదా మనసా రామునినామ మేమరకెప్పుడు వేమరు తలపగరాదా మనసా రా.. |
| రామదయాళో సీతాహృత్కామ యనరాదా మనసా శ్రీమద్భద్రాచలధామ శ్రీరామ యనరాదా మనసా రా.. |