కీర్తనలు భద్రాచల రామదాసు రామ రామ సీతా రామ
కన్నడ - ఏక (దేవగాంధారి - ఆది)
పల్లవి:
రామ రామ సీతా రామ
రామ రామ రామ సీతా రా..
చరణము(లు):
రాదా దయ ఇక నామీద యిపుడైన
పాదములకు మ్రొక్కెద పలుమారు విన్నవించెద రా..
తప్పులెంచబోకు నీ గొప్పతనము చెల్లదు నే
ఎప్పుడు నిన్నేనమ్మితి తప్పక నన్ను రక్షించుము రా..
ఏల ప్రత్యక్షము కావయ్య యేమి చేయుదు రామయ్య
జాలము చేయకుమయ్య శరణంటిని గదయ్య రా..
ఎంతకాలము నీదుమాయ ఎన్నటికి తెలియదాయె
అంతరంగము తెలుపవాయె ఆపదలు తొలగవాయె రా..
పతితపావన నామబిరుదు పాలించుకో మోసబుచ్చకు
ఇతరుల నే వేడ నీకు ఈశ్వరా యేల పరాకు రా..
నమ్మితినే గాక నాచేత నేమౌను నీకృపలేక
మిమ్ము నేవేడెదెందాక మీ సొమ్మైనాను పరాకా రా..
ఇక్ష్వాకు వంశమున బుట్టి యేమయ్యా నను చేపట్టి
రక్షింపవదియేటి న్యాయమొ రామా దశరథ పట్టి రా..
భద్రగిరిరామ నీ పదభక్తిని వదలి ఏమరి
మారుదైవముల గొలిచేనా చూడు మీదయ మరవకుమీ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raama raama siitaa raama ( telugu andhra )