కీర్తనలు భద్రాచల రామదాసు రామచంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ
సౌరాష్ట్ర - చాపు (హుస్సేని - త్రిపుట)
పల్లవి:
రామచంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ
రామచంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ రా..
చరణము(లు):
నీ చిత్తము నా భాగ్యము నిన్నే నెర నమ్మితి
ఏచక నా మొర విని నను రక్షింపవే రా..
భరతునివలెను పాదుకలు పూజచేయ నేర
కోరి లక్ష్మణునివలె కొలువగనేర రా..
ఓర్పుతో గుహునివలెను వోడనడుపనేర
నేర్పుతో నా వాలివలె నిన్నెరుగనేర రా..
అంగదునివలె నేనడపము బట్టనేర
సంగరమున సుగ్రీవునివలె సాధింపనేర రా..
గాలిపట్టివలె నే తాలిమిగ మోయనేర
బలిమితో హనుమంతునివలె పాటుపడనేర రా..
లీలతో శబరివలె లాలించి విందిడనేర
మేలిమిగ సీతవలె మెప్పింపగనేర రా..
గజరాజువలె గట్టిగ మొఱబెట్టనేర
విజయుని సతివలె వినుతిసేయనేర రా..
గురిగ జాంబవంతునివలె కోరి భజింపనేర
చేరి విభీషణునివలె శరణనగనేర రా..
వర జటాయువువలె ప్రాణములియ్యనేర
కరము నహల్యవలె గీర్తింపగనేర రా..
నేను రామదాసువలె పూని మిము భజింపనేర
నన్ను రక్షింపుము భద్రాచల రామధీర రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamachaMdraa nannu raxiMpavadeemoo neeneruga ( telugu andhra )