కీర్తనలు భద్రాచల రామదాసు రామనామము బల్కవే పాపపుజిహ్వ
పంతువరాళి - ఆది ( - త్రిపుట)
పల్లవి:
రామనామము బల్కవే పాపపుజిహ్వ
రామనామము బల్కవే పాపపుజిహ్వ శ్రీ రా..
అను పల్లవి:
రామనామము నీవు ప్రేమతో బల్కిన
స్వామి యెల్లప్పుడు కామితార్థములిచ్చు శ్రీ రా..
చరణము(లు):
మతిలేని వారలలో సీతాపతిని
సతతము దలచినను హితవున వారి పూర్వ
కృతము లెల్లమాన్పి కృపతోడను జూచి
అతులిత సామ్రాజ్యానందమొందజేయు శ్రీ రా..
మారసుందరాకారుని వేసారక ఎపుడు
కోరి భజించుడి భూరికర్మములను
చేరనియ్యకగొట్టి చెదరగ జేసి
పారద్రోలెడి రఘుపతి నిజనామము శ్రీ రా..
దాసులనెల్ల బ్రోచుచు భద్రగిరి ని
వాసుడై జగములనేలు శ్రీరాముడు
దోషములెల్ల బాపి వాసిగ ధర రామ
దాస హృదయ నివాసుడైన సీతా రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamanaamamu balkavee paapapujihva ( telugu andhra )