కీర్తనలు భద్రాచల రామదాసు రామనామమే జీవనము అన్య మేమిరా కృపావనము
ఆనందభైరవి - చాపు ( -త్రిపుట)
పల్లవి:
రామనామమే జీవనము అన్య మేమిరా కృపావనము
రామనామ సుధామధురము అది ఏమరక భజియించు మాకిక రా..
చరణము(లు):
శ్రీలమేలు భయానకము రఘువీరుల పేరే పానకము
పాలుమీగడ జారుతేనియ పాలకన్నను మేలిమైనది రా..
ఈ రసములెల్ల నీరసము రఘువీరుని కథలెల్ల పాయసము
సారెకు మాకు చేకూరెను ఆకలి తీరి తృష్ణ చల్లారెను రా..
ఘోరభవసింధు తారకము హృదయారి వర్ణనివారకము
సారమౌ ఘనసార కదళీఫలసార సౌఖ్యమా పారము రా..
సుందర శ్రీరాములు రఘునందనాంఘ్రి సరోజములు
చెంది బ్రహ్మానందభావము నందరికి నింపొందజేసిన రా..
భాసమాన శుభకరము నిజదాసలోక వశీకరము
భూసుత హితుడై భద్రాచలవాసుడై రామదాసునేలిన రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamanaamamee jiivanamu anya meemiraa kR^ipaavanamu ( telugu andhra )