| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామభద్ర రార శ్రీరమచంద్ర రారా |
| శంకరాభరణ - ఆది |
| పల్లవి: |
| రామభద్ర రార శ్రీరమచంద్ర రారా తామరసలోచన సీతాసమేత రారా రా.. |
| అను పల్లవి: |
| ముద్దుముద్దు గారగ నవమోహనాంగ రారా నిద్దంపు చెక్కిళ్ళవాడ నీరజాక్ష రారా రా.. |
| చరణము(లు): |
| చుంచు రవిరేఖతో నీ సొంపు జూతు రారా పంచదార చిలక నాతొ పలుకుదువు రారా పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మ రారా గట్టిగ కౌసల్య ముద్దుపట్టి వేగ రారా రా.. |
| నిన్ను మానలేనురా నీలవర్ణ రారా కన్నులపండువుగా కందు కన్నతండ్రి రారా అందెలు మువ్వలచేత సందడింప రారా కుందనపు బొమ్మ యెంతొ అందగాడ రారా రా.. |
| నాయెడల దయయుంచి నల్లనయ్య రారా బాయక యెప్పుడు నీ బంటునయ్య రారా పాదుకొన్న ప్రేమ నిబ్బరమాయె రారా పాదసేవకుడను నే ప్రత్యక్షముగ రా రా రా.. |
| ముజ్జగములకు నాది మూలబ్రహ్మ రారా గజ్జల చప్పుళ్ళు ఘల్లుఘల్లుమన రారా సామగానలోల నాచక్కనయ్య రారా రామదాసునేలిన భద్రాద్రివాస రారా రా.. |