కీర్తనలు భద్రాచల రామదాసు రామసుధాంబుధిధామ రామనాపై
సావేరి - చాపు (మధ్యమావతి - త్రిపుట)
పల్లవి:
రామసుధాంబుధిధామ రామనాపై
ఎందుకు దయరాదుర సీతా రా..
అను పల్లవి:
వేమరు వినయముతో వివరించితే
నా మనవి వినవేమిరా రా..
చరణము(లు):
మక్కువ నేనెంతో బతిమాలుకొన్న నీ మనసు కరగదేమిరా రామ
నిక్కముగా తల్లితండ్రి నీవని నెరనమ్మియున్నానురా రామ
దిక్కు నీవనియున్న దయజూడవిక మాకు దిక్కెవరున్నారురా రామ
ఎక్కడనున్నావో నా మొరాలకించవింత పరాకేలరా రామ రా..
ప్రతిదిన ముదరపోషణ చేయుటే దొడ్డవ్రతమని తిరిగితిరా రామ
మతిలేని ధనికులే గతియని దినదినము స్తుతిచేయసాగితిరా రామ
సతతము మాయ సంసారము నమ్మి దుర్గతినొంద నేనుంటిరా రామ
పతితపావన చాల వెతనొంది వచ్చితి గతిజూపి రక్షింపరా రామ రా..
నీపాదసేవ జేసిన సజ్జనులకు ఏపాపము లంటవుగా రామ
తాపత్రయముల మాన్పి నను నీదరిచేర్చి కాపాడవదేమిరా రామ
ఈపట్ల రక్షించి గాపాడకున్ననే నెవరివాడనౌదురా రామ
ఆపద్బాంధవ భద్రాద్రి రామదాసు డనుచు నన్నేలుకోరా రామ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamasudhaaMbudhidhaama raamanaapai ( telugu andhra )