కీర్తనలు భద్రాచల రామదాసు రామహో సీతారామహో రామహో సీతారామహో రా..
అహిరి - ఆది (కేదారగౌళ - ఆది)
పల్లవి:
రామహో సీతారామహో రామహో సీతారామహో రా..
చరణము(లు):
రామహో శరణన్న నా మొరాలించి కావవు
ప్రేమలేదు గదరా నా దుష్కర్మమేమొ తెలియదాయె రా..
మ్రొక్కి నిన్ను వేడగా నాదిక్కుజూడవేమి చేతు
చక్కనయ్య నీ నా యందు ఎక్కడి వైరము బుట్టె రా..
ఎట్టకేలకైన నిన్ను గట్టిగ నమ్మితి నేను
పెట్టుపోతలడుగలేదు పట్టిమాటాడగరాదా రా..
నన్ను సంరక్షించుటది ఎన్నరాని బరువదేమి
మన్ననజేసి నేడు నాకన్నుల కెదురై వసింపు రా..
దినదినము నీచుట్టు దీనుడై నే తిరుగగాను
కనికరమింతైన లేక కఠినుడైనావు గదరా రా..
సారెసారెకు నిన్ను వేడి భారకుడవనుచు నమ్మి
కోరి పిలిచితేను నన్ను తేరిచూడవేమి చేతు రా..
చాలగ నమ్మితి రఘుస్వామి భద్రశైలవాసా
ఏలుకొనుము రామదాసు నెప్పుడేమరకుండ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamahoo siitaaraamahoo raamahoo siitaaraamahoo raa.. ( telugu andhra )