కీర్తనలు భద్రాచల రామదాసు రావయ్య భద్రాచలరామ శ్రీరామా
బిలహరి - చాపు (- ఆది)
పల్లవి:
రావయ్య భద్రాచలరామ శ్రీరామా
రావయ్య జగదభిరామ లలామా రా..
అను పల్లవి:
కేవలభక్తి విలసిల్లునా
భావము దెలిసిన దేవుడవైతే రా..
చరణము(లు):
ప్రొద్దున నిన్ను పొగడుచు నెల్లప్పుడు
పద్దుమీరకను భజనలు చేసెద
గద్దరితనమున ప్రొద్దులు పుచ్చక
ముద్దులు గులుకుచు మునుపటివలె రా..
నన్నుగన్నతండ్రీ మదిలో నీ
కన్న నితరులను గొలిచెదనా ఆ
పన్నరక్షకా పర దినకర కుల
రత్నాకర పూర్ణసుధాకర రా..
అంజలిజేసెద నరమరలేక
కంజదళాక్ష కటాక్షము లుంచుము
ముజ్జగములకును ముదమిడు పదముల
గజ్జెలు కదలగ ఘల్లుఘల్లుమన రా..
దోషము లెంచని దొరవని నీకు
దోసిలియొగ్గితి తొలుత పరాకు
దాసుని తప్పులు దండముతో సరి
వాసిగ రామదాసునిక బ్రోవగ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raavayya bhadraachalaraama shriiraamaa ( telugu andhra )