కీర్తనలు భద్రాచల రామదాసు వందనము రఘునాయక ఆనందము శ్రీరఘునాయకా
ఖమాఛ్‌ - త్రిపుట
పల్లవి:
వందనము రఘునాయక ఆనందము శ్రీరఘునాయకా
పొందుగ పాదారవిందము కనుగొందునా రఘునాయకా వం..
చరణము(లు):
ఎవరేమన్నారు రఘునాయకా నే వెరువజాల రఘునాయకా
నవనీతచోర నీ నామమె గతి యని నమ్మితి రఘునాయకా వం..
మన్ననతో రఘునాయకా నా మనవిని వినుమా రఘునాయకా
సన్నుతింపజాల తండ్రి సరసిజదళనేత్ర నిన్ను రఘునాయకా వం..
చపలచిత్తుడ రఘునాయకా నన్ను చేపట్టుమి రఘునాయకా
విపరీతగుణముల నిడుమల పడితిని ఉపాయమెరుగను రఘునాయకా వం..
దాసపోషక రఘునాయకా నీవు దాతవు రఘునాయక
వాసిగ భద్రాచల రామదాసుని ఆసతీర్పుము రఘునాయకా వం..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - vaMdanamu raghunaayaka aanaMdamu shriiraghunaayakaa ( telugu andhra )